Parliament: రాజ్యసభ, లోకసభలో వక్ఫ్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 7 d ago

పార్లమెంటు వక్ఫ్ సవరణ బిల్లు-2025కు ఆమోదం పొందింది. రాజ్యసభ గురువారం అర్ధరాత్రి దాటేవరకు దాదాపు.. 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో సభలో ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేయగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీని ఆధారంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ ఖడ్ బిల్లును ఆమోదించారు. కాగా, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను కొట్టిపడేశారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం ఉండదన్నారు. ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తుల నిర్వహణకు సంబంధించినదని, అవినీతిని నిర్మూలించాలనే నేపథ్యంలో బిల్లును తీసుకొచ్చామని చెప్పారు.
కాగా, వక్ఫ్ సవరణ బిల్లు-2025 వక్స్ ఆస్తుల నిర్వహణను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం వారసత్వ ప్రదేశాలను కాపాడేందుకు, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వర్ఫ్ చట్టంలో సవరణలు చేసింది. అలాగే, ఆస్తి నిర్వహణలో పారదర్శకత, వక్ఫ్ బోర్డులు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం క్రమబద్ధీకరణ, వాటాదారుల హక్కుల రక్షణ ఈ చట్టం లక్ష్యం. ఇంకా, ముస్లిం మహిళలు, ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని మెరుగుపర్చడం, మెరుగైన వక్ఫ్ పాలన వివిధ ముస్లిం వర్గాల నుంచి ప్రాతినిధ్యం, వక్ఫ్ బోర్డును కలుపుకొనిపోయేలా చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. అయితే, వర్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ పరిపాలన కోసం లౌకిక, పారదర్శక, జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇది భారతదేశంలో వక్ఫ్ పరిపాలన కోసం ప్రగతిశీల, న్యాయమైన చట్రాన్ని నిర్దేశిస్తుంది.
అయితే, వక్ఫ్ సవరణ బిల్లు-2025 లోకసభలోనూ ఆమోదం పొందింది. సభలో ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది వ్యతిరేకించిన సంగతి విదితమే. 12 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ తదుపరి బుధవారం అర్ధరాత్రి లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. ఇక పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు రాష్ట్రపతికి వద్దకు వెళ్లి చట్టంగా మారనుంది. కేంద్రంలోని అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండి కూటమిల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారి తీసిన వక్ఫ్ సవరణ బిల్లు-2025కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు-2025నును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు. ప్రెసిడెంట్ ఆమోదం అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా రూపాంతరం చెందనుంది.
వక్ఫ్ బిల్లు ఆమోదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని వ్యాఖ్యానించారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లుతో అట్టడుగునే మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు.